Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సిద్ధరామయ్య వరుసగా రెండోసారి కర్నాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది రేపు తేలుతుంది కానీ…ఇవాళ్టి వరకు మాత్రం ఆయన ఓ ఘనత సాధించారు. ఆయన ముఖ్యమంత్రి పదవిచేపట్టి ఆదివారానికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి దేవరాజ్ అరసు తర్వాత ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసిన నేత సిద్ధరామయ్య ఒక్కరే. దేవరాజ్, సిద్ధరామయ్య ఇద్దరూ మైసూర్ కు చెందినవారే కావడం విశేషం. 2013 మే 13న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి… ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేయడంపై సిద్ధరామయ్య సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఐదేళ్లలో తాను చాలా నేర్చుకున్నానని, కావాల్సినంత రాజకీయపరిజ్ఞానం సంపాదించుకున్నానని తెలిపారు. తన సామర్థ్యం మేరకు కర్నాటకకు మంచి పనులు చేశానని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముందు రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు తానేం చేయాలనుకున్నానో దాదాపుగా అన్నీ చేశానని చెప్పుకొచ్చారు.
ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చాననే అనుకుంటున్నానని, ఇదంతా ప్రజల సహకారంతోనే సాధ్యమైందని అన్నారు. ఇకపైనా ప్రజలు తనపై ఇదే నమ్మకం ఉంచుతారనీ,మద్దతిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రాభివృద్ధికి ఐదేళ్ల సమయం సరిపోలేదని, ఇంకొక్క అవకాశం ఇవ్వాలని ఎన్నికల ప్రచారంలో కన్నడిగులను కోరిన సిద్ధరామయ్య…ఇప్పుడు మరోసారీ అలాగే విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధి పట్ల తాను సంతృప్తిగా లేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఇంకా పరుగులు పెట్టించే దిశగా పనిచేస్తానని ప్రజలకు హామీఇస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ లో దళిత ముఖ్యమంత్రి చర్చ జోరుగా నడుస్తుండడంతో..కాంగ్రెస్ గెలిచినా..సిద్ధరామయ్యకు మళ్లీ పదవి దక్కుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే సిద్ధరామయ్య మాత్రం తనకు ఇవే చివరి ఎన్నికలని, కాంగ్రెస్… ఓడినా, గెలిచినా…తాను ముఖ్యమంత్రి అయినా, కాకపోయినా…స్వగ్రామం సిద్ధరామనహుండిలోనే ఉంటానని, కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లనని ప్రకటించారు.