ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం

వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న సమావేశం నేపథ్యంలో హోం, గిరిజన సంక్షేమంతో పాటు వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశంలో ప్రస్తావించనున్న అంశాలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పన విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చ జరిపారు.

రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు, తదితర అంశాలను సమావేశంలో డీజీపీ వివరించారు. మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ తెలిపారు. సాయుధ మావోయిస్టుల బలం సుమారు 50కి పరిమితమైందన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకే పరిమితమైందని డీజీపీ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గిరిజనుల జీవితాలపై విశేష ప్రభావం చూపుతున్నాయన్నారు.

గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా వారి గడప వద్దకే సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు అతిపెద్ద కార్యక్రమమని, దీనిపట్ల గిరిజనులు సంతోషంగా ఉన్నారని డీజీపీ వెల్లడించారు. మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌ పట్ల గిరిజన యువకులు ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణమని డీజీపీ అన్నారు.