దేశంలో బొగ్గు ఉత్పత్తి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం పెరిగి 777 మిలియన్ టన్నులుగా ఉన్నట్టు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వేసవి ఎండల నేపథ్యంలో విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండడం గమనార్హం. దీంతో బొగ్గు నిల్వల కొరతపై వార్తలు వస్తున్న క్రమంలో మంత్రి చేసిన ప్రకటనకు ప్రాధాన్యం నెలకొంది. 2020–21 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 716 మిలియన్ టన్నులుగా ఉన్నట్టు మంత్రి గుర్తు చేశారు.
బొగ్గు సరఫరా 18 శాతం పెరిగి 818 మిలియన్ టన్నులుగా నమోదైంది.బొగ్గు గనుల్లో భద్రతకు సంబంధించి స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. బొగ్గు గనుల్లో భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. భద్రతా చర్యల అమలు విషయంలో నిధుల కొరత రాకుండా చూసుకోవాలని కోరారు. గతేడాది అక్టోబర్‌లోనూ బొగ్గు నిల్వలు తగ్గిపోవడం తెలిసిందే.