తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇటీవల అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఒప్పించిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే మరో దిగ్గజ కంపెనీ తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడితో ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.
తెలంగాణలో భారీ బేవరేజెస్ ప్లాంటు నిర్మించడంతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ స్కిలింగ్ విభాగంలో తెలంగాణ ప్రభుత్వం కలిసి పని చేసేందుకు హిందూస్థాన్ కోకాకోలా సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలంటూ హిందూస్థాన్ బేవరేజెస్ని మంత్రి కేటీఆర్ కోరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం గురువారం నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో కోకాకోలా సంస్థ నిర్మించ తలపెట్టిన పరిశ్రమ కోసం రూ.48.53ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. మొదటి దశలో రూ. 600 కోట్లతో ప్లాంట్ నిర్మాణం చేపట్టి.. రెండో దశలో రూ. 400 కోట్లతో ప్లాంట్ను విస్తరిస్తారని తెలిపారు.
ఈ ప్లాంట్లో 50 శాతం ఉద్యోగాలు స్థాని మహిళలకే కేటాయిస్తారని వెల్లడించారు. జగిత్యాలలోని మామిడి పండ్లు, నల్గొండ జిల్లాలోని నిమ్మ ఉత్పత్తులు ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపాందించుకోవాలంటూ కంపెనీ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్యాకేజింగ్ రంగంలోనూ హైదరాబాద్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న కేటీఆర్…. ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ కేంద్రంగా మారుతోందని స్పష్టం చేశారు.