బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి, సుదీర్ఘ కాలంగా కమెడియన్గా ప్రేక్షకులను అలరిస్తున్న అలీ మద్యలో హీరోగా కూడా చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ కామెడీతో మెప్పిస్తున్న అలీ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. గత కొంత కాలంగా ఒక రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆ పార్టీకి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగితే వెళ్తున్నాడు. అయితే ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. తాజాగా ఆ విషయమై ఒక క్లారిటీ ఇవ్వకనే ఇచ్చాడు.
తాజాగా తన సహాయకుడి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న అలీ రాజకీయ రంగ ప్రవేశంపై సూచాయిగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సరైన వేదిక, సమయం కాదని, సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి, అవి జరుగుతున్నప్పుడు మీకు తెలుస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. అలీ మాటలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని అనిపిస్తుంది. 2019 ఎన్నికల సమయంకు అలీ పూర్తిగా రాజకీయాల్లోకి దిగే అవకాశం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అలీ రాజకీయాల్లోకి వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తాడో అందరికి తెల్సిందే. తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఆ పార్టీలోకి పలువురు వెళ్లే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది.