Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత పర్యటన సందర్భంగా పీఎం నరేంద్రమోడీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత పర్యటనలో ఉన్న ట్రూడో సోమవారం ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. అయినప్పటికీ మోడీ ఆయన వెంట లేకపోవడంపై కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా మీడియాలో భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు వెలువడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే మోడీ ఇలా చేస్తున్నారంటూ ఊహాగానాలొస్తున్నాయి. ఈ వార్తలపై మన ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ అన్ని సార్లూ ప్రధాని మోడీ వెళ్లలేరు అని సమాధానమిచ్చాయి.
విదేశీ ప్రముఖులు వచ్చిన ప్రతిసారీ ప్రధాని మోడీ వెళ్లాల్సిన అవసరం లేదని, ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో ప్రధాని వెళ్లలేదని గుర్తుచేశాయి. అటు ఈ శుక్రవారం మోడీ ట్రూడోతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
గుజరాత్ పర్యటనలో ఉన్న ట్రూడో కుటుంబం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బంది ట్రూడో కుటుంబానికి సబర్మతీ ఆశ్రమాల విశేషాలు వివరించారు. ఆశ్రమంలో ట్రూడో భార్య సోఫీ కాసేపు చరఖా తిప్పారు. అక్కడి నుంచి గాంధీనగర్ వెళ్లిన ట్రూడో దంపతులు అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. గుజరాత్ పర్యటన సందర్భంగా ట్రూడో, ఆయన భార్య, పిల్లలు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించడం విశేషం.