టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీ పోటీ చేయనున్న బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ, టీఎంసీ మధ్య కీలక పోరుకు తెరలేచింది.
ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 6న జారీ చేయనుంది. అలాగే సెప్టెంబరు 30న పోలింగ్, అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. బెంగాల్ రాష్ట్ర ప్రత్యేక అభ్యర్థన, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
బెంగాల్‌లోని భవానీపూర్ షంషేర్‌గంజ్, జంగీపూర్‌తోపాటు, ఒడిశాలోని పిప్లిలోని రెండు స్థానాలకు ఉపఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మిగిలిన నియోజకవర్గాల ఉప ఎన్నికలు వాయిదా వేసింది. సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నటు వెల్లడించింది.
కాగా ఈ ఏడాది ఏప్రిల్-మే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోమొత్తం 294 సీట్లలో 213 స్థానాలను కైవం చేసుకొని మమత నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది. కానీ నందీగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సుమారు 2వేల ఓట్ల తేడాతో దీదీ ఓడిపోయినా, బెంగాల్ సీఎంగా మమత ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే తప్పనిసరిగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది.