లక్షలాది రూపాయల అద్దె కట్టకుండా ముఖం చాటేయడంతో పాటు దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారంటూ సినీ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌పై బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివాసం ఉంటున్న మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన మేరకు.. 2018లో మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా తమ భవనాన్ని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కు తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్(టీఎఫ్‌సీసీ) ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చామని నవ్వాడ శోభారాణి తెలిపారు. నెలకు నాలుగున్నర లక్షల అద్దెగా అంగీకరించారని రూ. 40 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పి రూ.30 లక్షలే ఇచ్చారని ఆరోపించారు.
అప్పటి నుంచి అద్దె సరిగ్గా ఇవ్వకుండా వేదింపులకు గురి చేశాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా పది రోజుల క్రితం తాను అద్దె చెల్లించలేనంటూ తాళాలు అప్పగించి వెళ్లిపోయిన ప్రతాని రామకృష్ణగౌడ్ తన కొడుకు సందీప్‌ను ఇంటి మీదికి పంపించి దౌర్జన్యానికి దిగాడన్నారు. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించడంతో పాటు తనకు ప్రభుత్వంలో పెద్ద వాళ్ళు పరిచయం ఉన్నారని తమ వద్దకు వస్తే అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.