శాశ్వత శత్రువులు మిత్రులయ్యారా..?

Congress And TDP meeting Shocks TRS

శాశ్వత శత్రువులు మిత్రులయ్యారా..?

టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరిగింది. కానీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఓ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ భవన్ కు వచ్చి టీడీపీ నేతలతో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్న తరుణంలో.. ఇలాంటి సమావేశం జరగడంతో.. టీఆర్ఎస్ వర్గాలు కూడా ఉలిక్కిపడుతున్నాయి.

శత్రువుకు శత్రువు మిత్రుడు అనే కోణంలో కేసీఆర్ ను టీడీపీతో కలిసి దెబ్బకొట్టాలని కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది. కేసీఆర్ చెప్పినట్లుగా రెండు పార్టీలు కలిస్తే నమ్మక ద్రోహం కాదని, అసలు బద్ధశత్రువులు కూడా ఒకే మాట చెబుతున్నారంటే.. టీఆర్ఎస్ ది ఎంత ఒంటెద్దు పాలనో ప్రజలకు బాగా అర్థమౌతోందని ఎన్టీఆర్ భవన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే గులాబీ బాస్ కు చిక్కులు తప్పవు.

కాంగ్రెస్ విప్ సంపత్ కుమార్ రేవంత్ కు ఫోన్ చేసి మరీ ఎన్టీఆర్ భవన్ కు వెళ్లి కలిశారు. ఆ సమయంలో మరో దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా అక్కడే ఉన్నారు. వీరు ముగ్గురు సమకాలీన రాజకీయాలపై మాట్లాడుకున్నా.. జస్ట్ ఫ్రెండ్ షిప్ మీటింగ్ అని టీడీపీ వర్గాలు తేలిగ్గా చెప్పేశాయి. కానీ టీఆర్ఎస్ కు మాత్రం అనుమానం మొదలైంది. తమకు తెలియకుండా ఈ రెండు పార్టీలూ ఏదో చేస్తున్నాయని తెగ టెన్షన్ పడుతున్నారు గులాబీ నేతలు.