Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దళితులపై దాడులు, బీజేపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాహారదీక్ష జరిపారు. దీక్షకు ముందు రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధి వద్ద రాహుల్ నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, షీలా దీక్షిత్, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్ తదితరులతో కలిసి దీక్ష చేపట్టారు. వివిధఅంశాలపై అధికార బీజేపీ దుష్ఫ్రచారాలకు, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా సమాజంలో శాంతిసామరస్యాలు కోరుతూ అన్ని రాష్ట్రాల రాజధానులు, అన్ని జిల్లాల కేంద్రాల్లో తమ పార్టీ కార్యకర్తలు దీక్ష చేపడతారని కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాల అనంతరం ప్రకటించింది. ఇందులో భాగంగానే రాజ్ ఘాట్ లో రాహుల్ దీక్షలో పాల్గొన్నారు. అటు నిరసనల కార్యక్రమానికి కాంగ్రెస్ వివాదాస్పద నేతలు జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ ను దూరంగా ఉంచారు. రాహుల్ గాంధీతో కలిసి దీక్షలో పాల్గొనేందుకు జగదీశ్ టైట్లర్ రాజ్ ఘాట్ వద్దకు రాగా ఆయన్ను అక్కడినుంచి వెళ్లిపోవాలని చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
జగదీశ్, సజ్జన్ లు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్నారు. వారు దీక్షలో పాల్గొంటే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు రాజ్ ఘాట్ లో నిరాహారదీక్షకు వెళ్లేముందు కాంగ్రెస్ నేతలు కొందరు హోటల్ లో పూరీలు తింటూ మీడియాకు చిక్కారు. ఈ ఫొటో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేత అరవింద్ సింగ్ వివరణ ఇచ్చారు. తాము చేసేది ఒక్కరోజు దీక్ష అని, ఉదయం 10.30 నుంచి 4.30 వరకు దీక్ష జరిగిందని, తాము ఉదయం 8గంటలకు ముందే టిఫిన్ తినడంలో తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేశాన్ని సమర్థవంతంగా పాలించే అంశంపై దృష్టిపెట్టకుండా, తాము ఏం తింటున్నాననే విషయంపై దృష్టిపెట్టారని విమర్శించారు.