పట్టణానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు రాంచంద్రారెడ్డి(62) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం షాద్‌నగర్‌లో కిడ్నాప్ చేశారని వార్త వెలువడిన గంటల వ్యవధిలోనే హత్యకు గురయ్యాడన్న సమాచారం అందటంతో పట్టణవాసులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల వద్ద హత్య చేశారు. రాంచంద్రారెడ్డి జడ్చర్ల కొత్తబస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన పెట్రోల్‌బంక్ నిర్వహిస్తున్నారు.
కుటుంబమంతా హైదరాబాద్‌లో ఉంటుండగా ఇతను మాత్రం జడ్చర్లలో ఉండటంతో పాటు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుండేవాడు. బాదేపల్లి సింగిల్‌విండో చైర్మన్‌గా పనిచేశారు. భూత్పూర్ జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. జడ్చర్ల శాసనసభ స్థానానికి కూడా అన్న టీడీపీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడి ఓటమి పాలయ్యారు. అనంతరం సుమారు నాలుగైదు ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
రాంచంద్రారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన సత్యనారాయణరెడ్డి సోదరుడి కుమారుడు. చివరి రోజుల్లో జడ్చర్లలోని రాంచంద్రారెడ్డి ఇంట్లోనే సత్యనారాయణరెడ్డి ఉన్నారు. అయితే సత్యనారాయణరెడ్డికి సంబంధించిన ఆస్థుల వ్యవహారంలో, దాయాదులతో భూతగాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే హత్యకు గురయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
షాద్‌నగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో రాంచంద్రారెడ్డిని అతని వాహనంలోనే కిడ్నాప్ చేశారని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్, హత్యకు సంబంధించి తమవద్ద ఎలాంటి సమాచారం లేదని జడ్చర్ల ఎస్‌ఐ శంషోద్దీన్ తెలిపారు. కాగా హత్యకు గురైన రాంచంద్రారెడ్డి సొంత గ్రామం షాద్‌నగర్ సమీపంలోని అన్నారం. భార్య వాణి, కుమార్తెలు అఖిల, నిఖిల, కుమారుడు రఘు ఉన్నారు.