రాహుల్ ఇప్పుడు త‌ల్లి చాటు బిడ్డ కాదు

rahul gandhi political comments on Narendra Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం రాహుల్ గాంధీ చేసిన ప్ర‌సంగం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఎప్పుడూ స‌ర‌ళంగా, సౌమ్యంగా మాట్లాడే రాహుల్ అధ్య‌క్ష‌హోదాలో చేసిన తొలి ప్ర‌సంగంలో మాత్రం వాడీవేడిగా మాట్లాడారు. ముఖ్యంగా బీజేపీని, మోడీని విమ‌ర్శిస్తూ రాహుల్ ప్ర‌సంగం సాగింది. దేశంపై న‌మ్మ‌కంతోనే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, ప్ర‌తి భార‌తీయుడి గొంతుక‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని రాహుల్ అన్నారు.

rahul-gandhi

దేశ‌సేవ‌కు అంకిత‌మైన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లకు ర‌క్ష‌ణ‌గా నిల‌వ‌డం త‌న బాధ్య‌త‌న్నారు. బీజేపీ రాజ‌కీయ విధానాలను ఈ సంద‌ర్భంగా రాహుల్ తీవ్రంగా తప్పుబ‌ట్టారు. దేశ‌ప్ర‌జ‌ల్లో చాలామందికి నేటి రాజ‌కీయాల ప‌ట్ల పెద్ద భ్ర‌మ‌లు లేవ‌ని, ద‌య‌, వాస్త‌వం వంటివి లోపించ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని రాహుల్ అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ‌కీయాల‌న్న‌వి ప్ర‌జ‌ల‌కు సంబంధించిన‌వ‌ని, కానీ ప్ర‌స్తుతం వాటిని ప్ర‌జ‌ల‌ను పైకి తీసుకొచ్చేందుకు కాకుండా వారిని అణ‌గ‌దొక్కేందుకు ఉప‌యోగించుకుంటున్నార‌ని రాహుల్ విశ్లేషించారు. దేశంలో నిప్పు రాజేస్తే దాన్ని నియంత్రించ‌డం కష్ట‌మ‌ని, బీజేపీ రాజేసిన హింస అనే నిప్పు దేశ‌వ్యాప్తంగా వ్యాపించింద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.

president-rahu-gandhi

కాంగ్రెస్ భార‌త్ ను 21వ శ‌తాబ్దంలోకి తీసుకువ‌స్తే..ప్ర‌ధానిమోడీ మ‌న‌ల్ని వెన‌క్కి, మ‌ధ్య‌యుగాల నాటికి తీసుకుపోతున్నార‌ని విమ‌ర్శించారు. అటు అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వేళ రాహుల్ గాంధీని తండ్రితో పోలుస్తూ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప‌ద‌మూడేళ్ల క్రితం రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన‌ప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు రాహుల్ ఎంతో ప‌రిణితి చెందిన వ్య‌క్తిలా క‌నిపిస్తున్నార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత టి. సుబ్బ‌రామిరెడ్డి అన్నారు. రాహుల్ తీరు, ప‌ద్ధ‌తి, ఆయ‌న చూపించే అభిమానం చూస్తుంటే రాజీవ్ గాంధీ గుర్తుకొస్తున్నార‌ని చెప్పారు.

congress-president

రాహుల్ లో ఆప్యాయ‌త‌, ఆవేశం, ఆవేద‌న ఉన్నాయ‌ని, ఈ ప‌ద‌విని ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు వెళ్తార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మోడీ చ‌రిష్మా ముందు రాహుల్ త‌ట్టుకోగ‌ల‌రా అన్న సందేహ‌మే లేద‌ని, అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడే ఎవ‌రికైనా వారిలోని శక్తి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని సుబ్బరామిరెడ్డి విశ్లేషించారు. గ‌తంలో రాహుల్ త‌ల్లి నీడ‌లో ఉండ‌డం వ‌ల్ల ఆయ‌న సామ‌ర్థ్యం గురించి ఎవ‌రికీ తెలియ‌లేద‌ని, ఇటీవ‌లి గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో రాహుల్ సత్తా చూసి మోడీ కూడా వ‌ణికిపోయార‌ని చెప్పుకొచ్చాడు. అధ్య‌క్షుడిగా రాహుల్ చేసిన ఉప‌న్యాసం ప‌రిపూర్ణంగా ఉంద‌ని, భ‌విష్య‌త్తులో ఆయ‌న క‌చ్చితంగా కాంగ్రెస్ కు విజ‌యం చేకూర్చుతాడ‌ని సుబ్బ‌రామిరెడ్డి ధీమా వ్య‌క్తంచేశారు.