కర్ణాటక ఎలక్షన్స్ : తెలుగు వారి వోట్లు వారికేనా ?

Congress vs BJP in Karnataka election 2018 Voting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నేడు జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కన్నడ నాటనే కాక దేశం అంతా ప్రత్యేక ఉత్కంటని నెలకొల్పాయి. పేరుకు మూడు పార్టీలు బరిలో ఉన్నా ప్రధాన పోటీ బిజెపి, కాంగ్రెస్‌ల మధ్యే. గత వైభవాన్ని తిరిగి సాధించాలని బిజెపి ఉబలాటపడుతుంటే ఉన్న అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ ఆరాటపడుతోంది. దేశ సార్వత్రిక ఎన్నిక లకు ఏడాది ఉండగా జరుగుతున్న కర్ణాటక ఎన్నికలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రభావం చూపుతాయి. అయితే మోడికి ఈ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. గతకొంతకాలంగా దేశంలో బిజెపి జైత్రయాత్ర సాగుతోంది. మోడి, అమిత్‌షా ధ్వయం వ్యూహం ముందు మరే ఇతర పార్టీలు నిలదొక్కుకోలేక పోతున్నాయి. అయితే పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టిల అమలు తర్వాత మోడి గ్రాఫ్‌ ఒడి దుడుకులకు గురౌతోంది. అలాగే ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు చావోరేవో తేల్చనున్నాయి. ప్రస్తుతం బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య జరుగుతున్న హోరాహోరీలో కన్నడిగులు ఎవరి పక్షాన నిలబడతారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

అంతే కాక కర్ణాటక రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలలోని తెలంగాణ – రాయలసీమ సరిహద్దు ప్రాంతాల ప్రజలతో ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల వారికి బెంగళూరు కంటే హైదరాబాద్‌ అంటేనే మక్కువ. కర్ణాటకలోని బీదర్‌, గుల్బార్గా, రాయచూర్‌, హుబ్లి, సిందనూర్‌, భీజాపూర్‌, గదగ్‌, భాగల్‌కోట్‌, ప్రాంతాలలో తెలుగు వారి సంఖ్య ఎక్కువే. కర్ణాటకలో ఉన్న మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 120 నియోజకవర్గా్ల్లో ఇతర భాషలవారి ప్రాబల్యమే ఎక్కువ. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, కేరళ రాష్ట్రాల నుంచి చాలామంది ప్రజలు ఈ రాష్ట్రంలో స్థిరపడమే ఆ ప్రాబల్యానికి కారణం. అయితే గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాల బట్టి తెలుగు ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పై కోపంగా ఉన్నారు. వీరంతా కర్ణాటకలో శాశ్వత నివాసితులయినా తమ జన్మభూమికి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ తీరును వ్యతిరేకిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని పదే పదే గుర్తు చేస్తూ తెలుగు వారి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసింది. పోలింగ్‌కు ఒక రోజు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా… తిరుపతి రావడం, ప్రత్యేక హోదాపై అక్కడ ప్రజలు ఆయన పై నిరసనలు వ్యక్తం చేయడం వంటి ఘటనలతో కర్ణాటక తెలుగు ఓటర్లకు స్పష్టంగా సంకేతాలు వెళ్ళాయనే అర్ధం చేసుకోవచ్చు. బీదర్‌, గుల్బార్గా, రాయచూర్‌, హుబ్లి, సిందనూర్‌, భీజాపూర్‌, గదగ్‌, భాగల్‌కోట్‌, బాగేపల్లి, శివమొగ్గ, బళ్లారి, రాయచూరు తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్ల సంఖ్య భారీగానే ఉంది. అలాగే బెంగళూరులో ఉన్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కోటి జనాభాలో… 25 లక్షల మంది తెలుగు ఓటర్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారి ఓట్లు కీలకం కానున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, జేడీఎస్‌లు వీరి ఓట్లు తప్పకుండా తమకే దక్కుతాయనే విశ్వాసంతో ఉన్నాయి. మరి, తెలుగు ఓటర్లు ఎవరి వైపు నిలబడతారు అనేది కన్నడ నాట కీలకం కానుంది.