మోసం చేసిన కానిస్టేబుల్‌

మోసం చేసిన కానిస్టేబుల్‌

వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్‌పై పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మహారాణిపేట వార్డు సచివాలయ కార్యదర్శిగా పని చేస్తున్న యువతికి మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నిమ్మకాయల నరేష్‌తో 2021 ఫిబ్రవరి నెలలో పరిచయం ఏర్పడింది. వాట్సాప్‌ చాటింగ్, ఫోను సంభాషణలతో మరింత చేరువయ్యారు. యువతిని పెళ్లి చేసుకుంటానని నరేష్‌ తరచూ ప్రతిపాదన చేసేవాడు.

ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్‌ 23న ఆ యువతిని తానుంటున్న పోలీస్‌ క్వార్టర్స్‌లోని గదికి తీసుకెళ్లి లోబరుచుకున్నాడు. అనంతరం పలుమార్లు రుషికొండ, పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగికంగా లోబర్చుకోవడంతో యువతి గర్భం దాల్చింది. ప్రాథమిక దశలోనే గుర్తించి మాత్రలతో గర్భస్రావం చేయించాడు. ఈ క్రమంలో వివాహం చేసుకోవాల్సిందిగా యువతి కోరడంతో ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో తనకు జరిగిన అన్యాయంపై బాధిత యువతి పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్‌ తెలిపారు.