తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఏఆర్ కానిస్టేబుల్ మరో వ్యక్తితో కలిసి.. ఓ యువకుడిని కొట్టి చంపాడు. బుధవారం తెల్లవారుజామున విజయవాడ అయ్యప్పనగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన ముక్కు వెంకటేష్(23), ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజు అయ్యప్పనగర్‌లో ఒకే ఇంట్లోని వేర్వేరు పోర్షన్లలో ఉంటున్నారు. వెంకటేష్‌కు వివాహం కాలేదు. డిస్టెన్స్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. తన భార్య, వెంకటేష్ కలివిడిగా ఉండటాన్ని నాగరాజు గమనించి ఇద్దరినీ పలుమార్లు హెచ్చరించాడు.
బుధవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో వారిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని ఇంటి యజమాని రత్నసాయి చూశాడు. డ్యూటీలో ఉన్న నాగరాజుకు ఫోన్ ద్వారా విషయం చెప్పాడు. డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన నాగరాజు, రత్నసాయి కలిసి వెంకటేష్‌పై రాడ్లతో దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న వెంకటేష్‌ను స్థానికులు 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు సీఐ రావి సురేష్‌రెడ్డి తెలిపారు. నాగరాజుతో పాటు, రత్నసాయి, ఆయన భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.