అతనో పోలీస్ కానిస్టేబుల్. అన్నాతమ్ముళ్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. అంతా పోలీసులే కదా ఏమైనా చేయవచ్చనుకున్నాడేమో కానీ భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. అనుమానం వచ్చిన భార్య ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. వివరాల్లోకెళ్తే.. నల్గొండ జిల్లా పానగల్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు దూరంగా ఉంటూ రెండో భార్యతో ఉండసాగాడు.
కొంతకాలంగా భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన మొదటి భార్య నిఘా పెట్టగా అతగాడి నిర్వాకం బయటపడింది. రెండో భార్యతో ఉన్న ప్రసాద్‌ను మొదటి భార్య, ఆమె బంధువులు కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 8 ఏళ్లుగా కానిస్టేబుల్ ప్రసాద్ మొదటి భార్యకు దూరంగా ఉన్నట్లు బాధితురాలు పేర్కొంది. తనకు, పిల్లలకు అన్యాయం చేస్తోన్న ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మొదటి భార్య కోరుతోంది. ఘటనపై మొదటి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.