అస్సాంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పుట్టగొడుగులు తిని 13 మంది దుర్మణం పాలయ్యారు. అవి విషపూరితమైనవి కావడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
అడవి పెరిగే పుట్టగొడుగులు తిని.. అస్సాం ఎగువ ప్రాంతం చరయ్దియో, దిబ్రుఘఢ్, శివసాగర్, టిన్సుకియా జిల్లాల నుంచి సుమారు 35 మంది ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఇందులో నలుగురు సోమవారం, తొమ్మిది మంది మంగళవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతుల్లో ఒక చిన్నారి ఉండగా.. ఎక్కువ మంది టీ తోటల్లో పని చేసే కూలీలని తెలుస్తోంది.
అడవుల్లో పెరిగే పుట్టగొడుగుల్లో విషం ఉంటుంది. అయితే తినేవిగా పొరబడి ఇళ్లకు తీసుకెళ్లారు వాళ్లు. వండుకుని తిన్నాక ఫుడ్ పాయిజన్ కావడంతో నాలుగు జిల్లాలకు చెందిన 13 మంది మృతి చెందినట్లు అస్సాం మెడికల్ కాలేజీ సూపరిండెంట్ ప్రశాంత దిఘింగియా వెల్లడించారు. చికిత్స తీసుకుంటున్న టైంలోనే వాళ్లంతా చనిపోయినట్లు తెలిపారు.
అస్సాం అడవుల్లో దొరికే విషపూరితమైన పుట్టగొడుగుల్ని.. తినేవిగా పొరబడడం, ఇలాంటి ఘటనలు జరగడం మామూలే. అయితే ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించడం ఇదే మొదటిసారి కావొచ్చని వైద్యులు అంటున్నారు.