Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విధి నిర్వహణలో అసువులు బాసిన కొడుకును చూసి ఆయన తండ్రి గర్వపడుతున్నారు. తన కొడుకు అమరుడని, అందుకే తాను కన్నీరు పెట్టనని ఆయన ఉద్వేగంగా అన్నారు. ఉబికి వస్తున్న కన్నీటిని నియంత్రించుకుంటూ ఆయన చెప్పిన ఈ మాటలు అక్కడ ఉన్న వారందరితో కంటతడి పెట్టిస్తున్నాయి. డార్జిలింగ్ లో గూర్ఖా జనముక్తి మోర్చా మద్దతుదారులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎస్ ఐ అమితాబ్ ఇంట్లో జరిగిన హృదయవిదారక ఘటన ఇది. అమితాబ్ భౌతికకాయాన్ని ఇంటికి తరలించగా… ఆయన తల్లి, భార్య గుండెలవిసేలా రోదించారు. తండ్రి మాత్రం పంటిబిగువన బాధను భరిస్తున్నారు. అమితాబ్ కు 2015లో డార్జిలింగ్ లో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడి పరిస్థితులు దృష్ట్యా ఉద్యోగం మానేయమని అమితాబ్ తండ్రి సౌమెన్ అనేకసార్లు కొడుకుకు సూచించారు. కానీ అమితాబ్ ఇందుకు నిరాకరించారు.
ఓ పోలీస్ అధికారి తండ్రి అయినందుకు గర్వపడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని వదిలేయనని చెప్పేవారు. ఆ క్రమంలోనే విధినిర్వహణ లో అమరుడయ్యారు. తన కొడుకును చూసి తాను గర్వపడుతున్నానని… కన్నీరు పెట్టనని సౌమెన్ అన్నారు. అటు అమితాబ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. ఉద్యోగంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 5లక్షల ఆర్థిక సాయంచేస్తామని తెలిపారు. జీజేఎం అధినేత బిమల్ గురుంగ్ ను పట్టుకునేందుకు వెళ్లిన భద్రతా దళాలపై మద్దతుదారులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అమితాబ్ ప్రాణాలు కోల్పోగా… నలుగురు పోలీసులు గాయపడ్డారు.