Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత నెల చివరి రోజుల్లో హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన హత్య కేసుల్లో కొండాపూర్ బొటానికల్ గార్డెన్ దగ్గర లభ్యమైన మహిళ మృతదేహం కేసు ఒకటి. గర్భిణిగా ఉన్న మహిళ దారుణంగా హత్యకు గురయిన ఘటన నగర ప్రజలను వణికించింది. సాధారణంగా గర్భిణులపై మన సమాజంలో సానుభూతి, గౌరవం ఉంటాయి. గర్భిణులకు హాని చేసేందుకు ఎంత కఠిన హృదయం ఉన్నవారికైనా మనసు రాదు. అలాంటిది ఎనిమిది నెలల గర్భిణి మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి ఉండడం అందరికీ భయం కలిగించింది. అదే సమయంలో ఈ కేసు గురించి ఓ తప్పుడు అంచనా కూడా ఏర్పడింది. గర్భిణిగా ఉన్న అమ్మాయి హత్యకు గురయిందంటే వివాహేతర సంబంధం కారణం అయిఉండవచ్చయనీ, సంబంధిత వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చనీ అంతా భావించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కూడా తొలుత అదే అనుమానం వ్యక్తంచేసినప్పటికీ…ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టలేదు.
కేసు తీవ్రత దృష్ట్యా నిందితులను పట్టుకోవడం ఛాలెంజిగ్ గా భావించిన అధికారులు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్, నేర విభాగం డీసీపీ జానకి షర్మిళ ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం వేట కొనసాగిస్తూ వచ్చాయి. కొన్ని బృందాలు ఘటనాస్థలంలో లభ్యమైన ఆధారాల ద్వారా నిందితుల కోసం ఆరా తీస్తుండగా, మరికొన్ని బృందాలు ఘటనాస్థలం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. ఆ దృశ్యాల్లో అస్పష్టంగా బైక్ పై గోనెసంచి పట్టుకుని వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు. టెక్నాలజీ జోడించి ఆ దృశ్యాలను మరింత స్పష్టంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెల్లడయింది.
నిండు గర్భిణిని కుటుంబ సభ్యులే హతమార్చారని తెలిసి పోలీసులు సైతం షాక్ తిన్నారు. కేసు వివరాల్లోకి వెళ్తే…బీహార్ కు చెందిన అమరకాంత్ ఝా కుటుంబం గత కొంతకాలంగా హైదరాబాద్ మాదాపూర్ సిద్ధిఖినగర్ లో నివాసం ఉంటోంది. అమర్ కాంత్ స్థానికంగా ఓ బార్ లో పనిచేస్తున్నాడు. కుటుంబంలో తలెత్తిన విభేదాల కారణంగా కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ విభేదాలు మరింత ముదిరి….గత నెల 28వ తేదీన అమర్ కాంత్ కుటుంబ సభ్యులు గర్భిణిగా ఉన్న పెద్ద కోడలిని దారుణంగా హతమార్చారు. తల్లి, అన్నతో కలిసి అమర్ కాంత్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు నిర్ధారించారు. హత్యకు పథకం వేసిన అనంతరం అమర్ కాంత్ అన్న, హతురాలి భర్త తన కొడుకుని తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం తల్లితో కలిసి అమర్ వదినను హతమార్చాడు.
ఎవరూ గుర్తుపట్టని విధంగా ముఖాన్ని ఛిద్రం చేశాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్లాస్టిక్ సంచుల్లో వేశారు. 29వ తేదీ తెల్లవారుజామున మూడున్నరగంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై తీసుకొచ్చి పడేశారు. మృతదేహం ముక్కలు ఉన్నట్టు గుర్తించిన స్థానికులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముక్కలుగా ఉన్న శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్రం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసును అన్ని విధాలుగా దర్యాప్తు చేసి చేధించారు.