ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. భారత్‌లోనూ విజృంభణ కొనసాగిస్తోంది. ఇప్పటికీ గణనీయ సంఖ్యలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 35,551 మంది కోవిడ్ బారిన పడగా, 526 మరణాలు సంభవించినట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జారీచేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.
ఇప్పటి వరకు దేశంలో మొత్తం 95.3 లక్షల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,38,648కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 4,22,943గా నమోదైంది. ఇప్పటి వరకు 89,73,373 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అయితే రాజధాని ఢిల్లీలో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించబోమని, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది..