కరోనా వైరస్ అమెరికాను వణికిస్తోంది. మరోవైపు భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే రోజుకు లక్ష కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అమెరికా ఆరోగ్య నిపుణుడు నిన్న(మంగళవారం) హెచ్చరించారు. వైరస్ నియంత్రణ, నివారణ చర్యలపైనా ఆందోళన వ్యక్తం చేసిన ఆయన అత్యవసర చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌కు సూచించారు. ప్రమాదకరమైన పెరుగుదలను నివారించడానికి తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఫౌసీ నొక్కిచెప్పారు.
మహమ్మారిని అణిచివేసేందుకు అధికారులు, ప్రజలు చర్యలు తీసుకోకపోతే రోజుకు ప్రస్తుతం 40వేలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇకపై లక్షకు చేరినా ఆశ్యర్యం లేదని కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కాంగ్రెస్‌ను హెచ్చరించారు. మహమ్మారిపై సమీక్ష సందర్భంగా సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్ అండ్ పెన్షన్స్ కమిటీలో ప్రసంగిస్తూ ఫౌసీ ఈ హెచ్చరిక జారీ చేశారు. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం నిబంధలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అమెరికా మహమ్మారి నియంత్రణలో తప్పు దారిలో ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా కేసులు వ్యాపిస్తున్న తరుణంలో తక్షణమే ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కరోనా కట్టడికి సామాజిక ప్రయత్నంలో భాగంగా, బాధ్యతగా వ్యవహరించాలని ఫౌసీ సూచించారు. ప్రధానంగా బార్లలో మాస్క్ లు ధరించకపోవడం, సామాజిక దూర మార్గదర్శకాలను పాటించకపోవడం వంటి “ప్రమాదకరమైన” ప్రవర్తన మంచిది కాదంటూ దేశ యువతను ఫౌసీ తీవ్రంగా హెచ్చరించారు.
యుఎస్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నప్పటి ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో సమావేశమవుతున్నారని, ముసుగులు ధరించడంలేదని ఫౌసీ ఆరోపించారు. లాక్ డౌన్ మార్గదర్శకాలపై అమెరికన్లు సరైన శ్రద్ధ చూపడం లేదన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అలాగే 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ఆశిస్తున్నానన్నారు. కాగా 2.6 మిలియన్లకు పైగా కేసులు, లక్షా 26 వేల మరణాలతో ప్రపంచంలోనే అత్యంత కరోనా ప్రభావిత దేశంగా అమెరికా నిలిచింది.