రెండో సారి కరోనా మహమ్మారి

రెండో సారి కరోనా మహమ్మారి

కరోనా వైరస్ మహమ్మారి రెండో సారి విజృంభించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే అమరావతి, యావత్మల్ జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూలను అమల్లోకి తీసుకురాగా.. మాస్క్ ధరించాలనే నిబంధనలను తప్పనిసరి చేసింది. ముంబయిలోనూ ఒక అపార్ట్‌మెంట్‌లో ఐదు కంటే ఎక్కువ కేసులు నిర్ధారణ అయితే ఆ భవనం మొత్తం సీల్ చేయాలని నిర్ణయించారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.. లేకపోతే రూ.200 జరిమానా కట్టాల్సి ఉంటుంది.

కాగా, పుణేలో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు నగర డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు ఆదివారం వెల్లడించారు. సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. రాత్రి 11.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర సర్వీసులు తప్ప మిగతావి మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రెస్టారెంట్లు సైతం రాత్రి 10.15 గంటలు దాటిన తర్వాత ఆర్డర్లు నిలిపివేయాలి. న్యూస్ పేపర్, పాలు, కూరగాయలు, ఆస్పత్రులకు మినహాయింపు ఉంటుంది.

పుణే జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్, పోలీసు అధికారులతో ఇంఛార్జి మంత్రి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఫిబ్రవరి 28 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించారు. సోమవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రాత్రి 11 నుంచి ప్రజలను బయట తిరగడానికి అనుమతించరు.

దేశంలోని ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో 74 శాతం మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితోపాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లోనూ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ విధానంతో వైరస్‌ను కట్టడి చేయాలని తెలిపింది. ర్యాపిడ్ టెస్ట్‌ల్లో నెగెటివ్ వచ్చినవారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను చేయాలని పేర్కొంది.