నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కేవలం ఈ నాలుగు రోజుల్లోనే 367 పాజిటివ్ కేసులు నమోదు కాగా… తాజాగా శుక్రవారం మరో 116 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే 483 పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. నగరంలో ఒక వైపు రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతుండటం… మరో వైపు అదే స్థాయిలో మరణాల సంఖ్య కూడా నమోదవుతుండటం నగరవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
కేవలం సాధారణ సిటీజనులే కాకుండా వైరస్‌తో పోరాడుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు సైతం వైరస్ బారిన పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఉస్మానియా, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న సుమారు 50 మంది వైద్యులతోపాటు పలువురు పారిశుద్ధ్య కార్మికులు, సెక్యురిటీ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులతోపాటు రోగులు సైతం ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
కింగ్‌కోఠి ఆస్పత్రిలో 22 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా, నెగిటివ్ వచ్చిన తొమ్మిది మందిని డిశ్చార్జి చేశారు. మరో 57 మంది నుంచి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి 44 మంది అనుమానితులు రాగా.. వీరిలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయుర్వేద ఆస్పత్రికి 65 మంది పాజిటివ్ రోగులు వచ్చారు.
ఏ రూపంలో వైరస్ విజృంభిస్తుందో తెలియక అయోమయంతో ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా 3290 పాజిటివ్ కేసులు నమోదైతే.. వీటిలో 2138 పాజిటివ్ కేసులు కేవలం హైదరాబాద్ నగరంలోనే వెలుగు చూశాయి. ఇక ఇప్పటి వరకు 113 మంది మృతి చెందగా, వీరిలో వంద మందికిపైగా గ్రేటర్‌లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.