ఆంధ్రప్రదేశ్ లో కీలక ప్రదేశమైన తాడేపల్లిలో కరోనా కలకలం సష్టిస్తోంది. తాజాగా తాడేపల్లిలోని డోలాస్ నగర్లో కరోనా పాజిటివ్ తొలికేసు నమోదైంది. 3కి.మీ. వరకు రెడ్ జోన్‌గా.. 7 కి.మీ. బఫర్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. అంతేకాకుండా మార్కింగ్ వేశారు. సీఎం జగన్ నివాసం ఉంటున్న భరతమాత కూడలి ప్రాంతం బఫర్ జోన్ కిందికి వచ్చింది.
కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం కరోనా బఫర్ జోన్లోకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో హైరిస్క్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. తాజాగా మంగళగిరి కమర్షియల్ టాక్సెస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. తాడేపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసముంటున్నాడు. కాగా అతడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. ఆ అపార్టుమెంట్లో వ్యక్తులు బయటకు రాకుండా నిబంధనలు అమలు చేస్తున్నారు. అపార్టుమెంట్లో పనిచేసే వాచ్మెన్.. ఇళ్లలో పనిచేసే వారి వివరాలు సేకరించి పలువురిని క్వారెంటైన్‌కు తరలించారు. కాగా ఆ ప్రదేశం మొత్తం ఏ ఒక్కరినీ వెళ్లనీయకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.
అంతేకాకుండా అపార్ట్మెంట్కి చుట్టుపక్కల ఓ కిలోమీటర్ వరకు అత్యంత భద్రతను పటిష్టం చేశారు. పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం. చుట్టుప్రక్కల గ్రామాలను మూడు జోన్లుగా విభజించారు. మూడు కిలోమీటర్ ఏరియాను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఏడు కిలో మీటర్ల ఏరియాను బఫర్ జోన్ గా ప్రకటించారు.