జాతీయ విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర సంస్థల్లో 2020–21 విద్యా సంవత్సరపు ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను ఏడు నుంచి ఆరు దశలకు కుదించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భావిస్తోంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్స్, అడ్వాన్సుడ్ పరీక్షలలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఇప్పటివరకు ఈ సంస్థల్లో ప్రవేశాలకు ఏడు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్–19, లాక్డౌన్ల దృష్ట్యా జేఈఈ మెయిన్స్ రెండో విడత, అడ్వాన్సుడ్ పరీక్షలు ఆలస్యమైన నేపథ్యంలో ఈ రెండు ముగిసిన అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను ఆరు విడతలకు కుదించి సీట్లు భర్తీ చేయడమే మంచిదని జేఈఈ అడ్వాన్సును నిర్వహిస్తున్న ఐఐటీ ఢిల్లీ.. జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి ప్రతిపాదించింది.
దీనిపై అన్ని ఐఐటీల నుంచి ఆమోదం వచ్చాక సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డుకు పంపిస్తారు.జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్‌ను, జేఈఈ అడ్వాన్సును ఆగస్టు 23న నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. జేఈఈ అడ్వాన్సు ఫలితాలను వారంలో ఇవ్వాలని, అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించి ఆరు విడతల్లో పూర్తిచేస్తే అక్టోబర్ మొదటి వారం నుంచే తరగతులను ఆరంభించేందుకు అవకాశముంటుందని భావిస్తున్నారు. కోవిడ్–19 గందరగోళ పరిస్థితులు లేకపోతే సెప్టెంబర్‌లోపే తరగతులను ప్రారంభించేవారు.