ఏడేళ్ల కిందటి హత్య కేసులో దంపతులను కామాక్షి పాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ గౌస్, హీనా కౌసర్ కాగా, హతుడు వజీర్‌బాషా. ఈ దంపతులు ఏపీ నుంచి వచ్చి బెంగళూరులోని హగ్గనహళ్ళిలో ఉండేవారు. గౌస్ టైలర్‌గా పని చేసేవాడు. హీనా కౌసర్.. వజీర్ అనే వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పు తీసుకుంది.
ఆ సమయంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన భర్త గౌస్ అతన్ని అంతమొందించాలని పథకం వేశాడు. ఒకరోజు భార్య ద్వారా అతన్ని పిలిపించి ఇద్దరూ కలిసి ప్రాణాలు తీశారు. శవాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి వజీర్ తీసుకొచ్చిన వాహనం ద్వారానే హిందూపురం సమీపంలో పడేసి అనంతపురం జిల్లాలో తలదాచుకున్నారు.
ఇటీవల హీనా కౌసర్ తాత చనిపోగా అంత్యక్రియల కోసం దంపతులు వచ్చారు. హతుని భార్య ఆయేషా ఆ దంపతులపై ఫిర్యాదు చేయగా కామాక్షి పాళ్య పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ నేతృత్వంలో అరెస్టు చేసి విచారించగా నేరం తామే చేశామని అంగీకరించారు.