అగ్ని ప్రమాదంలో దంపతులు సజీవ దహనం

అగ్ని ప్రమాదంలో దంపతులు సజీవ దహనం

అగ్ని ప్రమాదంలో దంపతులు సజీవ దహనమైన సంఘటన సోమవారం ఉదయం పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, ఎర్రావారిపాళెం మండలం, కోటకాడపల్లెకు చెందిన భుక్కే నాగేశ్వరనాయక్‌ , బి.సిద్ధేశ్వరి కి 20 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 17 సంవత్సరాలుగా పీలేరు పట్టణం సైనిక్‌ నగర్‌లో కాపురం ఉంటున్నారు. నాగేశ్వరనాయక్‌ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా శ్రీనగర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వారం క్రితం శ్రీనగర్‌ నుంచి పీలేరుకు వచ్చాడు.

సోమవారం ఉదయం హఠాత్తుగా ఇంట్లో మంటలు ఎగిసిపడుతుండగా కేకలు వినిపించాయి. దీంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే నాగేశ్వర్‌నాయక్‌ మృతి చెందాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సిద్ధేశ్వరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అగ్నిప్రమాదంలో భార్య భర్తలిద్దరూ మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. కుమారుడు విష్ణువర్ధన్‌ నాయక్‌ ఇంటరీ్మడియెట్‌ ద్వితీయ సంవత్సరం, కుమార్తెలు అంజలి టీటీసీ, శ్రీచైతన్య బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు రూరల్‌ సీఐ తులసీరామ్, ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు.