పెద్దలు పెళ్ళికి నిరాకరించారని యువ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలోని వాంకిడి మండలం రాంనగర్ గ్రామానికి చెందిన నౌగడే శ్రీకాంత్ , గీత గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారి ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పి వివాహం చేయమని కోరారు. దీంతో అబ్బాయి ఇంట్లో ఒప్పుకున్నప్పటికి ,గీతా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. చివరకు ఈ విషయం గ్రామ పెద్దలు వరకు వెళ్లింది. దీంతో ఇరు కుటుంబాల వారికి నచ్చజెప్పి, కొంత సమయం వేచి చూడాల్సిందిగా పెద్దలు చెప్పారు
కొన్ని రోజులు వేచి చూసిన శ్రీకాంత్, గీతలు ఇక తమకు వివాహం జరపరని మనస్తాపానికి గురై గత సోమవారం ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అయితే సోమవారం పొలం పనుల కోసం అకిని గ్రామ సమీపంలోని పత్తి చేనుకు వెళ్ళిన కూలీలకు ప్రేమ జంట చెట్టుకు ఉరి వేసుకుని శవాలై కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవాలు కుళ్ళిన స్థితిలో ఉండటంతో 3 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.