కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు క్షణికావేశంతో బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన రాయవరం మండలం సోమేశ్వరంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శాకా అరవరాజు (42), నాగలక్ష్మి (38) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్యోతికి పెద్దలు కుదిర్చిన వివాహం చేశారు. చిన్న కుమార్తె అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి, గత జనవరి 23న కులాంతర వివాహం చేసుకుంది. అప్పటి నుంచీ అరవరాజు చిన్న కుమార్తెతో మాట్లాడడం మానేసినట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం ఐదో నెల గర్భిణిగా ఉన్న చిన్న కుమార్తెను ఇంటికి తీసుకు వచ్చే విషయంలో భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాగలక్ష్మి, అరవరాజు గొడవ పడ్డారు. ఇటుకల బట్టీలో కూలి పని చేసుకునే అరవరాజు బయటకు వెళ్లిపోగా, భార్య నాగలక్ష్మి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని సాయంత్రం చుట్టుపక్కల వారు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.
భార్య ఉరి వేసుకుందన్న సమాచారం తెలిసిందో.. లేక మనస్పర్థలో కానీ అరవరాజు మద్యంలో పురుగు మందు కలుపుకొని పొలాల్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్ద కుమార్తె పేపకాయల జ్యోతి ఫిర్యాదు మేరకు రాయవరం ఎస్సై పీవీవీఎస్‌ఎన్ సురేష్ అనుమానాస్పద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, అనపర్తి సీఐ ఎన్‌వీ భాస్కరరావు సందర్శించారు. కుమార్తె ప్రేమ వివాహం నేపథ్యంలో జరిగిన గొడవలతోనే దంపతులు బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.