ఆంధ్రప్రదేశ్ లో కరోనా అనుమానం పెను విషాదాన్ని మిగిల్చింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కరోనా కలకలం రేపింది. దీంతో కరోనా సోకిందన్న అనుమానంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆ దంపతులిద్దరూ కరోనా వచ్చిందన్న అనుమానంతో… అదేభయంతో ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
రాజమండ్రిలోని ప్రకాశ్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్యభర్తలు అనుమానాస్పద స్థితిలో శవాలై కనిపించారు. చెట్ల పొదల్లో సగం కాలిన దంపతుల మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరు స్థానికులా? లేక ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసు వీలైనంత త్వరగా చేధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. చెట్ల పొదల్లో రెండు మృతదేహాలను కాలిన స్థితిలో చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కాగా ఆ దంపతులిద్దరూ రాసిన సూసైడ్ నోట్ లో కరోనా అనుమానంతో చనిపోతున్నామని పేర్కోవడం పెను కలకలాన్ని సృష్టిస్తుంది. కాగా రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచమంతా కరోనా వైరస్ ఎఫెక్ట్ తో అల్లల్లాడిపోతుంది. అందరినీ వణికించేస్తుంది. అనుమానితులను పెంచుతోంది. దీంతో విషాదాలకు కరోనా దారితీస్తుంది.