పెళ్లయి మూడేళ్లవుతున్నా పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాసర మండలం టాక్లీలో విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మేశెట్టి రంజితను మహారాష్ట్రకు చెందిన సంతోష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. సంతోష్ ఇల్లరికం వచ్చాడు. అప్పటినుంచి దంపతులిద్దరూ టాక్లీలోనే ఉంటున్నారు. అయితే వారితోపాటు పెళ్లయిన వారికి పిల్లలు కలగడంతో కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.
పిల్లల కోసం నిజామాబాద్, బాసరలోని వైద్యులను సంప్రదించారు. పిల్లలు లేకుంటే సమాజంలో చిన్నచూపు చూస్తారన్న భావనతో కొద్దిరోజులుగా భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ.. బుధవారం రాత్రి బాసరలోని గోదావరిలో ఇద్దరూ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం మృతదేహాలు నీటిలో తేలగా.. జాలర్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రాజు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దంపతులిద్దరినీ సంతోష్ (26), రంజిత (22)గా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.