ప్రమాదకరమైన B.1.1.529 వేరియంట్‌

ప్రమాదకరమైన B.1.1.529 వేరియంట్‌

గత కొంత కాలంగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఆరోగ్యం పరంగానేగాక ఆర్థికంగానూ దెబ్బతిన్నాయి. ఇటీవలే వైరస్‌ రక్కసి నుంచి తప్పించుకున్నామని కాస్త ఊపిరి పీల్చుకునేలోపే ప్రపంచానికి దక్షిణాఫ్రికా ఓ బాంబు పేల్చింది. ఆ దేశంలో.. ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన వేరియెంట్‌ కొందరిలో వెలుగుచూసిందని, పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా ఇది కనపడుతోందని ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది.

కోవిడ్‌-19 ఎపిడెమియాలజీలో హానికరమైన మార్పును సూచించే సాక్ష్యాధారాల ఆధారంగా.. డబ్ల్యూహెచ్‌ఓ B.1.1.529 వేరియంట్‌కు ‘ఒమిక్రాన్‌’గా నామకరణం చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూహెచ్‌ ఒమిక్రాన్‌ని అత్యంత ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియంట్‌ జాబితాలో చేర్చింది. తాజాగా ఇజ్రాయిల్‌, బెల్జియంలోనూ ఒమిక్రాన్‌ కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భారత్‌ దక్షిణాఫ్రికా మద్య జరగనున్న క్రికెట్‌ సిరీస్‌ కూడా సందిగ్థంలో పడింది.

ఇప్పటికే కొన్ని దేశాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాల రాకపోకలను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించింది. కొత్త వేరియంట్ తెరపైకి రావడంతో స్టాక్ మార్కెట్లు, పతనం వైపుకు పరుగులు పెరుగుతున్నాయి. అంతేగాక ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఈ వేరియంట్‌ ఆటంకంగా మారనుంది.