గత కొద్ది రోజులుగా నెమ్మదించిన కరోనా మహమ్మారి ఉధ్రుతి పెంచింది. యూరప్ దేశాల్లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో పశ్చిమ యూరప్ దేశాల్లో ఒక్కటైన ఆస్ట్రియాలో 10 రోజుల పాక్షిక లాక్‌డౌన్ సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగో వేవ్ కారణంగా ఆస్ట్రియాలో శనివారంనాడు 15,297 కొత్త కేసులు నమోదయ్యాయి.
గత వారం రోజూ 10వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతుండటంతో అక్కడ పాక్షిక లాక్‌డౌన్ అమలుచేయాలని నిర్ణయించారు. గరిష్ఠంగా 10 రోజుల పాటు దేశంలో ఈ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచి లాక్‌డౌన్ అమలులోకి రాగా.. పది రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
పాక్షిక లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా షాపులు, రెస్టారెంట్స్ మూతపడ్డాయి. సుమారు 8.9 కోట్ల మంది జనాలు ఇంటికే పరిమితం అయ్యారు. కాగా నిత్యవసారాలు, కార్యాలయాలకు వెళ్లేవారికి మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. పాఠశాలలు, కిండర్‌గార్డెన్స్ తెరిచి ఉంచినప్పిటికి.. కొన్ని రోజుల పాటు పిల్లలు ఇంటి వద్దనే ఉంచి.. ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అయ్యేలా చూడాలి అని ప్రభుత్వం తల్లిదండ్రులను కోరింది.
అయితే వ్యాక్సిన్ వేయించుకోని వారికి మాత్రం లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం హెచ్చరించింది. అటు వాక్సినేషన్‌ను వేగవంతం చేసినట్లు ఆ దేశ ఇంటీరియర్ మంత్రి కార్ల్ నెహమ్మీర్ ఆదివారంనాడు మీడియాకు తెలిపారు.
ఫిబ్రవరి 1 నుంచి దేశంలోని ప్రతిఒక్కరికా వ్యాక్సిన్ తప్పనిసరి చేయనున్నట్లు ఆ దేశ ఛాన్సలర్ అలెగ్జాండెర్ ఛాలెన్‌బెర్గ్ శుక్రవారంనాడు స్పష్టంచేశారు. అయితే దీన్ని ఎలా అమలుచేయనున్నారో ఆయన వెల్లడించలేదు. పశ్చిమ యూరప్‌లో అతి తక్కువగా ఆస్ట్రియాలో 66 శాతం మంది మాత్రమే ఇప్పటి వరకు పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు తెలిపారు.