కోవిడ్ కు చికిత్స చేయాలో లేదో తెలీదు. జస్ట్ అనుమానమే. దాన్ని తేల్చి వైద్యం చేయాలంటే హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల తీరు తెలిస్తే షాక్ కావాల్సిందే. కోవిడ్ అనుమానితులు.. పాజిటివ్ వచ్చినోళ్లు.. ఎవరైనా సరే ఒకటే తీరు. ఒకటే లక్ష్యం. వీలైనంతగా డబ్బుల్ని దోచుకోవటం తప్పించి మరింకేమీ తమకు ప్రాధాన్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించి షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.
రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రులు రూ.5 లక్షల క్యాష్ అడ్వాన్స్ ఉంటే మాత్రమే బెడ్లు కేటాయిస్తున్నాయి. బీమా ఉన్నప్పటికీ.. నగదు మాత్రమే తమకు ప్రాధాన్యమని తేల్చి చెబుతున్నాయి.పది కాదు ఇరవై లక్షల ఆరోగ్య బీమా పాలసీ ఉన్నా.. వైద్యం చేయలేమని తేల్చి చెబుతున్నారు. ఆసుపత్రిలో బెడ్డు కావాలంటే క్యాష్ మాత్రమే ఉండాలని.. మిగిలిన వాటితో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు సంచలనంగా మారింది.
అంతేకాదు.. రోగి ఆసుపత్రిలో చేరి టెస్టులు చేసిన తర్వాతే ఎంత ఖర్చు అవుతుందో గతంలో చెప్పేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆసుపత్రిలో అడుగు పెట్టే సమయంలోనే ప్యాకేజీ ఫిక్స్ చేస్తున్నారు. తాము వేసిన బిల్లుకు ఓకే అనే పద్దతి ఒకటైతే.. ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని లెక్క కట్టి ముందే చెప్పేసి.. ఆ బిల్లుకు ఓకే అంటేనే బెడ్డు సౌకర్యాన్ని కల్పిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులకు కొదవ లేదు.
అసలు కరోనా పాజిటివ్ పేషెంట్ అవునో కాదో అన్న విషయం తేలనప్పటికీ.. ఐదారు లక్షలు అడ్వాన్స్ కట్టేస్తే తప్పించి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం దొరకని పరిస్థితి. దీంతో.. రోగుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అందరి దగ్గర నగదు ఉండే అవకాశం లేనప్పటికీ.. వైద్యం కావాలంటే క్యాష్ కొట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తాము చెప్పిన దానికి రోగులు స్పందించకుంటే బెడ్లు ఖాళీ లేవని చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పుడో మరో కొత్త దందాకు తెర తీశారని చెబుతున్నారు.
ఇచ్చిన డబ్బుల మొత్తానికి బిల్లు అయితే ఒక మొత్తం చెల్లించాలని.. బిల్లు అక్కర్లేదంటే.. కాస్త తగ్గిస్తామని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి తీరు కొన్ని వ్యాపారాల్లో కనిపిస్తాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి తీరు ఉండదు. అందుకు భిన్నంగా ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు బరి తెగిస్తున్నాయి. లక్ష రూపాయిలు చెల్లిస్తే.. రూ.30వేల నుంచి రూ.40వేల వరకు మాత్రమే బిల్లు ఇస్తామని.. మిగిలిన మొత్తానికి ఎలాంటి బిల్లు ఇవ్వమని తేల్చి చెబుతున్నాయి. ఎందుకిలా? అంటే.. ప్రభుత్వానికి కట్టే పన్ను ఎగ్గొట్టేందుకు ఈ తీరును ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
తాము వసూలు చేస్తున్న భారీ మొత్తాల్ని బీమా కంపెనీలు ఒప్పుకోవు. అందుకే.. బీమా ఉంటే తాము ట్రీట్ మెంట్ ఇవ్వలేమని.. కేవలం క్యాష్ ఉన్న వారికి మాత్రమే వైద్యం చేస్తామని హైదరాబాద్ లోని చాలావరకు కార్పొరేట్ ఆసుపత్రులు తేల్చి చెబుతున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు వేస్తున్న బిల్లును బీమా కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవని.. అందుకే ఈ కొత్త ఎత్తుకు తెర తీసినట్లు చెబుతున్నారు. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల తీరుతో రోగులు వణికిపోతున్నారు.