హైదరాబాద్‌ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్‌ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

గాంధీ ఆస్పత్రికి మళ్లీ కరోనా బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో వైద్య అధికారులు అప్రమత్తం అయ్యారు. గాంధీ ఆస్పత్రికి రోజుకు 50వరకు సివియర్ కరోనా కేసులు వస్తున్నాయి.తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి కరోనా బాధితుల తాకిడి మరోసారి ఎక్కువైంది. కరోనా వార్డు బాధితులతో నిండిపోయింది.

గాంధీకి రోజుకు 50 వరకు సివియర్ కేసులు వస్తున్న పరిస్థితి నెలకొంది.వారం క్రితం వరకు గాంధీలో రోజుకు 20 వరకు మాత్రమే కరోనా అడ్మిషన్లు నమోదు అయ్యాయి. కాగా మళ్లీ కేసులు పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో వరుస పండుగలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో 206 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఐదు రోజుల్లో మూడు సార్లు కరోనా కేసులు వంద దాటాయి.

గత శనివారం 147 కరోనా కేసులు నమోదు అవగా… బుధవారం 99 కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక తాజాగా 108 కొత్త కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో గత 24 గంటల్లో 1,16,815 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 657 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా… 578 మంది కోలుకున్నారు.