ఒకవైపు దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అంతానికి టీకా అందుబాటులో రానుందనే ఆశ చిగురిస్తోంటే..మరోవైపు కోవిడ్-19 ఉధృతి ఆందోళన పుట్టిస్తోంది. తాజాగా భారతదేశపు ప్రధాన విద్యా సంస్థ చెన్నై ఐఐటీలో కరోనా కేసులు కలకలం రేపింది. చెన్నై ఐఐటీ క్యాంపస్‌లో ఒక్కసారిగా 71 మందికి కరోనా బారినపడ్డారు. ఇందులో 66 మంది విద్యార్థులున్నారని ఐఐటీ అధికారులు తెలిపారు. ఎక్కడ నుంచి విస్తరించిందోతెలియదుగానీ, కేవలం ఒక్కరోజులోనే 32 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని క్యాంపస్ అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున క్యాంపస్‌లోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం ఇనిస్టిట్యూట్‌కు సూచించింది. యూనివర్సిటీలో 774 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం క్యాంపస్‌లో మళ్లీ లాక్డౌన్ నిబంధనలను అమలులోకి తెచ్చామని, అన్ని డిపార్టుమెంట్లను మూసివేస్తున్నట్లు తెలిపారు.
ఐఐటీ చెన్నై ఆదివారం జారీ చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం కోవిడ్ కేసులు పెరిగిన దృష్ట్యా, తదుపరి నోటీసులిచ్చే వరకు అన్ని విభాగాలు, కేంద్రాలు, లైబ్రరీని వెంటనే మూసివేయాలని నిర్ణయించారు. అధ్యాపకులు, సిబ్బంది, ప్రాజెక్ట్ సిబ్బంది, పరిశోధకుల తదితరులు ఇంటి నుండే పని చేస్తారు. క్యాంపస్‌లో బస చేసే విద్యార్థులు, ప్రాజెక్ట్ సిబ్బంది అందరూ తమ హాస్టల్ గదులకు మాత్రమే పరిమితం కావాలి. భౌతిక దూరం, ఫేస్‌మాస్క్ లాంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. కోవిడ్ (జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, విరేచనాలు, రుచి /వాసన కోల్పోవడం లేదా తదితర) లక్షణాలు కనిపించినవారు తక్షణమే అధికారులను సంప్రదించాలని సర్క్యులర్‌లో పేర్కొంది.