భారత్‌లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గత కొన్ని రోజులుగా భారీ స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలో కోవిడ్ కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం ఆందోళన రేకేత్తిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి గురువారం రోజు 703 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
భారత్‌లో ఇప్పటి వరకు 3.85 కోట్ల మందికి కోవిడ్ సోకగా.. 4,88,396 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 20,18,825 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 17.94 శాతానికి పెరిగింది. నిన్న 2,51,777 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 3,60,58,806కి పెరిగింది. రికవరీ రేటు 93.50శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు 9,692కు చేరాయి. ఇప్పటి వరకు 160.43 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు.