ఏపీని కరోనా టెన్షన్ వెంటాడుతోంది. పాజిటివ్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గణాంకాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రుల్లో చేరికలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జులై 20 నుంచి రోజూ సగటున 594 మంది చొప్పున చేరుతున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ సంఖ్య 800గా ఉంది. జులై 2 నుంచి 11వ మధ్య సగటున 197 మంది ఆసుపత్రుల్లో చేరారు. థర్డ్ వేవ్ సంకేతాలు వస్తున్న సమయంలో.. ఇలా ఆసుపత్రుల్లో చేరికలు పెరగడంతో అంరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైరస్ వేరియంట్లలో మార్పులతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు, ఇతర కారణాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందట. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం శనివారం నాటికి రాష్ట్రంలో 21,180 క్రియాశీలక కేసులు ఉన్నాయి. వీరిలో 5,051 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు కొవిడ్ కేర్ సెంటర్లు, ఇళ్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. ఈ ఆంక్షల్ని దుర్వినియోగం చేయొద్దని.. కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో తొలి విడతలో పాజిటివిటీ రేట్ తగ్గుదల వేగంగా ఉంది. మలివిడతలో మాత్రం నెమ్మదిగా తగ్గుతోంది. జులై 1న 4.2శాతం పాజిటివిటీ రేట్ ఉండగా 13న 3.13శాతంగాగా, 14న 2.87శాతంగా నమోదైంది. రెండు వారాలు దాటినా ఇప్పటికీ 2శాతం కంటే తగ్గలేదు. శనివారం పాజిటివిటీ రేట్ 2.6% గా నమోదైంది. ఈ కేసులు కరోనా రెండో విడత ప్రభావం ఇంకా ముగిసిపోలేదన్న సంకేతాలు ఇస్తోంది. జులై 17నాటికి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 5వేల 085గా ఉంది. 18న 4వేల983 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు.
శనివారం నాటికి ఈ సంఖ్య 5వేల501గా ఉంది. సాధారణంగావైతే వీరి సంఖ్య బాగా తగ్గాల్సి ఉంది.శనివారం 2వేల058 కేసులు నమోదైతే.. కోలుకున్న వారు 2వేల53 మంది ఉన్నారు.రాష్ట్రంలో అందరూ నిబంధనలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జనం సమూహాలుగా చేరుతుండటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం అనే మూడు అంశాలపైనే కరోనా నియంత్రణ ఆధారపడి ఉంటుందంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు, 45 ఏళ్ల వయసు దాటిన వారు, గర్భిణులకు టీకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఏపీ చేరింది. థర్డ్ వేవ్‌ను నిలువరించేందుకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కుల్లేకుండా బయటకొస్తే జరిమానా.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.