పొరుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

పొరుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

పొరుగు రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం కర్ణాటకపై పడుతుందనే భయం అటు అధికార వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ మూడోదశ ముప్పు తలెత్తకుండా ఆరోగ్యశాఖ కఠిన నిర్ణయాలు అమలు చేయడానికి ప్లాన్‌ చేసింది. కేరళ, మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి ప్రవేశించే ప్రజలకు ఆర్‌టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేసింది.గతంలో కోవిడ్‌ టీకా వేసుకున్న వారికి నెగిటివ్‌ రిపోర్టు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ప్రస్తుతం టీకా వేసుకున్నప్పటికీ రాష్ట్రానికి రావాలంటే 72 గంటలలోపు కరోనా పరీక్ష చేయించుకున్నట్లు రిపోర్టు తీసుకురావాలి. కేరళ సరిహద్దున ఉన్న దక్షిణకన్నడ, చామరాజనగర,చిక్కమగళూరు, హాసన్‌లో కరోనా కేసులు హెచ్చుమీరుతున్నాయి. ఆయా జిల్లాల్లో కోవిడ్‌ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని, సరిహద్దులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్యశాఖ కమిషనర్‌ త్రిలోక్‌చంద్ర తెలిపారు.పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పండుగలు, ఇతర కార్యక్రమాల ప్రయాణాలపై నిషేధం విధించాలని నిపుణులు సలహా ఇచ్చారు.

ఆలయాల్లో గుంపులుగా చేరకుండా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.కరోనా రక్కసి మళ్లీ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,890 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 1,631 మంది కోలుకోగా.. మరో 34 మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,03,137కు పెరగ్గా 28,43,110 మంది కోలుకున్నారు. మరణాలు 36,525కి చేరాయి. ప్రస్తుతం 23,478. కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

పాజిటివిటీ రేటు 1.30 శాతానికి పెరిగింది. బెంగళూరులో తాజాగా 426 కేసులు, 366 డిశ్చార్జిలు, 9 మరణాలు నమోదయ్యాయి. బెంగళూరులో మొత్తం 12,26,889 కేసులు నమోదు కాగా 12,02,560 మంది కోలుకున్నారు. మరో 15,861 మంది మరణించారు. 8,467 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 1,45,197 మందికి కరోనా పరీక్షలు చేశారు. 1,76,862 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు