బీజేపీ నేతపై రైతులు దాడి

బీజేపీ నేతపై రైతులు దాడి

ఓ బీజేపీ నేతపై రైతులు దాడి చేశారు. ఆయనపై చెయ్యి చేసుకోవటమే కాకుండా, బట్టలు చింపేశారు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. శుక్రవారం శ్రీ గంగానగర్‌లోని గంగా సింగ్‌ చౌక్‌ వద్ద బీజేపీ నేత కైలాస్‌ మొఘల్‌ కొంతమంది పార్టీ కార్యకర్తలతో భైఠాయించారు. లా అండ్‌ ఆర్డర్‌, నీటి సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కొద్దిసేపటి తర్వాత కొంతమంది రైతులు అక్కడికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో రైతులకు, బీజేపీ శ్రేణులకు మధ్య గొడవ చోటుచేసుకుంది.రైతులు కైలాస్‌పై దాడి చేసి కొట్టడమే కాకుండా బట్టలు చింపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, రైతు నాయకులు అక్కడికి చేరుకుని కైలాస్‌ను రక్షించారు. రైతులకు సర్ధిచెప్పి అక్కడినుంచి పంపేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పూనియ ఈ సంఘటనను ఖండించారు. ప్రజాస్వామ్యంలో అహింసకు తావులేదని ఆయన అన్నారు.