కోవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కార్ చర్యలు చేపట్టిన మరునాడే భారీగా కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 128 ఒమిక్రాన్ కేసులు బయటపడగా.. ఒక్క ఢిల్లీలో 73 నమోదయ్యాయి. దీంతో 238 కేసులతో హస్తిన తొలి స్థానంలో నిలవగా… 167 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781 కి చేరింది. బాధితుల్లో 241 మంది కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది. 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని తెలిపింది.
కొద్ది రోజులుగా కోవిడ్ కేసుల్లో తగ్గుదల కనిపించగా నిన్న భారీగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9,195 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 44 శాతం అధికంగా కేసులు నమోదవడం గమనార్హం. ఇక మొత్తం బాధితుల్లో తాజాగా 302 మంది మృతి చెందగా.. 7,347 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.40 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్‌లో పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం 77,002 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.