ప్రపంచం మొత్తం కోవిడ్ దెబ్బ

ప్రపంచం మొత్తం కోవిడ్ దెబ్బ

ప్రపంచం మొత్తం కోవిడ్ దెబ్బకు విలవిలలాడుతుండగా.. టోంగాలో మాత్రం ఇప్పుడు తొలి కేసు నమోదుకావడం గమనార్హం. న్యూజిలాండ్ సమీపంలోని దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో ద్వీపమైన టోంగాలో శుక్రవారం కరోనా కేసు నమోదయ్యింది. దేశంలో తొలి కేసు నమోదైనట్టు ఆ దేశ ప్రధానమంత్రి పోహివా టు ఒనెటోవా వెల్లడించారు. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ వేసుకున్నా.. కరోనా సోకిందని తెలిపారు. క్రిస్ట్‌చర్చ్‌లో విమానం ఎక్కే సమయంలో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో అతడికి నెగెటివ్‌ వచ్చిందన్నారు.

టోంగాకు వచ్చిన తర్వాత చేసిన పరీక్షల్లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించామని పేర్కొన్నారు. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే వారం లాక్‌డౌన్‌కు సిద్ధమవ్వాలని ప్రధాని సూచించారు.లక్షమంది జనాభా ఉన్న టోంగా.. న్యూజిలాండ్‌కు 2,380 కి.మీ, ఫిజికి 800 కి.మీ దూరంలోనూ ఉంది.

ఇప్పటి వరకు అక్కడ కోవిడ్ నమోదు కాకపోవడానికి ముందు జాగ్రత్త చర్యలే కారణం. కోవిడ్ మహమ్మారి ప్రపంచంపై పంజా విసురుతోందని తెలిసిన వెంటనే.. టోంగా ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించి.. గతేడాది మార్చి నుంచే ఎమెర్జెన్సీని ప్రకటించింది. కోవిడ్ కేసులు లేకున్నా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే 86 శాతం మందికి తొలిడోసు.. 62 శాతం మందిరెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసింది.

అయితే, విదేశాల్లో కరోనా కేసులు అదుపులోకి వచ్చి, ఆంక్షలు సడలించడంతో టోంగాలోనూ విదేశీ ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ ఆ దేశానికీ చేరింది. తొలి కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారని, వీలైంత త్వరగా.. వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని టోంగా ఆరోగ్యశాఖ మంత్రి అమెలియా తెలిపారు.

న్యూజిలాండ్ నుంచి 215 మందితో బయలుదేరిన విమానంలో టోంగా ఒలింపిక్ బృందం కూడా ఉంది. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన వీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత క్రిస్ట్‌చర్చ్‌లో ఉండిపోయారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ దాదాపు 25 కోట్ల మంది కోవిడ్ బారినపడ్డారు. వీరిలో 50 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.