60 శాతం మంది 35 ఏళ్లలోపు వారే……

60 శాతం మంది 35 ఏళ్లలోపు వారే......

యువతరంపై మళ్లీ కోవిడ్‌ పంజా విసురుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 60 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాల పేరుతో ఆఫీసుకు వెళ్లాల్సి రావడం, కాయగూరలు, నిత్యావసరాల కొనుగోలు పేరుతో మార్కెట్ల చుట్టూ తిరుగుతుండటం, పార్టీలు, ఫంక్షన్ల పేరుతో రాత్రి పొద్దుపోయే వరకు జనసమూహంలో గడుపుతుండటం, భౌతిక దూరం పాటించక పోవడమే కాదు…చివరకు మాస్కులు కూడా ధరించక పోవడంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరిస్తోంది.

తాజాగా వైరస్‌కు చలి తోడవడంతో సమస్య మరింత జఠిలంగా తయారైంది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కూడా ప్రారంభం కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిపై వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కూడా లేకపోవడంతో వైరస్‌ నిర్ధారణ అయిన పాజిటివ్‌ బాధితులు కూడా బయట తిరుగుతున్నారు. వీరు బయటి నుంచి వైరస్‌ను మోసుకొచ్చి…ఇంట్లో ఉన్న మహిళలకు, వృద్ధులకు విస్తరింపజేస్తున్నారు.