ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 కోసం బీసీసీఐనుంచి ఫ్రాంచైజీల వరకు అంతా సిద్ధమైపోతున్నారు… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆగస్టు 20 నుంచి ఒక్కో జట్టు యూఏఈ వెళ్లేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సమయంలో నిర్వాహకులను ఇబ్బంది పెట్టే వార్త ఇది. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న దిశాంత్ యాజ్ఞిక్‌కు కరోనా వచ్చినట్లు తేలింది.
కోవిడ్–19 పరీక్షలో తనకు పాజిటివ్‌గా వచ్చినట్లు అతను ప్రకటించాడు. యూఏఈ బయల్దేరడానికి ముందు జట్టు సభ్యులందరినీ ఒకే చోట చేర్చే క్రమంలో తాము పరీక్షలు నిర్వహించామని, ఇందులో యాజ్ఞిక్ పాజిటివ్‌గా తేలినట్లు రాయల్స్ యాజమాన్యం వెల్లడించింది. అయితే గత పది రోజుల్లో అతనికి దగ్గరగా జట్టులోని ఏ ఆటగాడు వెళ్లలేదని కూడా ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.