కోవిడ్‌–19 టీకా కార్యక్రమం

కోవిడ్‌–19 టీకా కార్యక్రమం

దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా జరుగుతున్న కోవిడ్‌–19 టీకా కార్యక్రమం 92 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో ఇచ్చిన 59,48,360 డోసులతో కలిపి, మొత్తం 92,17,65,405 డోస్‌లను ఇప్పటి వరకు ప్రజలకు అందించారు. అంతేగాక గత 24 గంటల్లో 24,770 మంది రోగులు కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 3,31,75,656 కు పెరిగింది.

అదే సమయంలో దేశవ్యాప్త రికవరీ రేటు 97.94 శాతానికి చేరింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపట్టిన నియంత్రణ చర్యల కారణంగా వరుసగా 101వ రోజు కూడా 50వేల కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,833 కొత్త కేసులను గుర్తించారు. మరోవైపు దేశంలో ప్రస్తుత యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,46,687కు చేరింది. ఇది 203 రోజుల కనిష్ట స్థాయి అని కేంద్రం ప్రకటించింది.

కాగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తిని గుర్తించేందుకు నిర్వహించే పరీక్షలను చేపడుతున్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,09,825 పరీక్షలు చేయగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57.68 కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించారు. అయితే వారపు పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.34 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 37 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 120 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది.