చిన్నారుల కోసం మరో కోవిడ్ వ్యాక్సిన్‌

చిన్నారుల కోసం మరో కోవిడ్ వ్యాక్సిన్‌

చిన్నారుల కోసం మరో కోవిడ్ వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను 2 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఇచ్చేందుకు అనుమతించాలని డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫార్సులు చేసింది. కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. చిన్నారుల కోసం భారత్ బయోటెక్‌ కొవాగ్జిన్ టీకా రూపొందించి క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు నుంచి 18ఏళ్ల వారిపై 2, 3 దశల ప్రయోగాలను గత నెలలో పూర్తి చేసింది.

క్లినికల్ ట్రయల్స్ నివేదికను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కి అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన నిపుణుల కమిటీ.. పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించాలని సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకాకు ఆగస్టులోనే 12 ఏళ్లుపైబడిన చిన్నారుల కోసం అత్యవసర వినియోగం కింద అనుమతి లభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాక్సిన్ ఇంకా పంపిణీ ప్రారంభం కాలేదు.

కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి లభిస్తే పిల్లలకు అందుబాటులోకి వచ్చే రెండో టీకా అవుతుందది. పిల్లలకు తొలి డోసు ఇచ్చిన 20 రోజులకు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. పెద్దవారికి ఉపయోగించిన ఫార్ములాతోనే పిల్లలపై కొవాగ్జిన్ పరీక్షించారు. అయితే, భద్రత, సమర్థతకు హామీ ఇవ్వడానికి ప్రత్యేక పరీక్షలు అవసరం. ఈ ట్రయల్స్‌పై డేటా ఇంకా వెల్లడించలేదు. అయితే దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు.

ఇక, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సైతం నొవావాక్స్ పేరుతో చిన్నారులకు టీకాను అభివృద్ధి చేసింది. ఏడు నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారుల కోసం రూపొందించిన ఈ టీకా.. క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతించింది. అలాగే, బయలాజికల్ ఈ ఫార్మ సంస్థ కూడా కొర్బేవాక్స్ కూడా ఐదేళ్లు దాటి పిల్లల కోసం టీకాను రూపొందించింది.