ఒంటరిగా ఉంటున్న చైతన్య

ఒంటరిగా ఉంటున్న చైతన్య

టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికీ హాట్ ఇష్యూగా నడుస్తున్న అంశం నాగ చైతన్య- సమంత డివోర్స్. ఈ ఇష్యూపై లెక్కలేనన్ని వార్తలు చూసాం. చై- సామ్ మధ్య విభేదాలకు కారణాలు, భరణం, పెళ్లికి ముందే కండీషన్స్.. ఇలా ఎన్నోరకాల వార్తలు షికారు చేశాయి. ఇక విడాకుల తర్వాత సమంత ముంబై వెళుతుందని కొన్ని వార్తలు రాగా.. కాదు కాదు హైదరాబాద్ లోనే ఉండనుందని కొందరున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగ చైతన్య నివాసానికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

కొద్ది రోజులుగా నాగ చైతన్య అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటున్నారని.. హైదరాబాద్ లోనే ఓ ఫ్లాట్‌ కొనేసి ‘లవ్‌ స్టోరీ’ మూవీ షూటింగ్‌కు అక్కడి నుంచే వచ్చారని టాక్ నడిచింది. విడాకుల ప్రకటనకు ముందు చై-సామ్ ఇద్దరూ గచ్చిబౌలిలో సమంతకు చెందిన ఓ అపార్ట్మెంట్లో నివ‌సించేవారని స‌మాచారం. అయితే ఇద్దరి కోసం గతేడాది నాగ చైతన్య జూబ్లిహిల్స్‌లో ఓ విలాసవంతమైన బంగ్లా కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇది పూర్తవడానికి ఇంకా ఎడాది సమయం పట్టొచ్చని అంటున్నారు. అయితే విడాకుల ప్రకటన అనంతరం చై-సామ్‌ ఎవరికి వారు ఉంటున్నారని, అదే అపార్ట్మెంట్ లో మరో ఇల్లు తీసుకొని నాగ చైతన్య ఒంటరిగా ఉంటున్నారని సమాచారం. కనీసం కుటుంబాన్ని కలవడానికి కూడా ఆయన ఇష్టపడటం లేదట. తాను జూబ్లిహిల్స్‌లో కొన్న కొత్తింటి పనులు పూర్తికాగానే ఆయన నేరుగా అక్కడికే వెళ్లనున్నారట. ఇందులో నిజమెంత ఉందో తెలియదు గానీ.. ఈ సంగతి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.