కోవిడ్-19 కట్టడికి వచ్చే వారం నుంచీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు తాజాగా యూకే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మెసెంజర్ ఆర్‌ఎన్‌ఈ సాంకేతితతో ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఎంహెచ్ఆర్ఏ మద్దతివ్వడంతో యూకే ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో రూపొందించిన వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించమంటూ ఇటీవల యూఎస్ఎఫ్డీఏ, యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థలకు ఫైజర్ దరఖాస్తు చేసింది.
ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల స్వతంత్ర నియంత్రణ సంస్థ(ఎంహెచ్ఆర్ఏ) ఓకే చెప్పడంతో యూకే ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసింది, దీంతో వచ్చే వారం నుంచి యూకేలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా తొలిసారి వ్యాక్సిన్ అధికారిక వినియోగానికి అనుమతించిన దేశంగా యూకే నిలవనుంది. ఇదేవిధంగా కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్‌ను అందించిన తొలి కంపెనీలుగా ఫైజర్, బయోఎన్‌టెక్ ఆవిర్భవించనున్నాయి.