దేశ జనాభాలో మూడొంతుల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన చైనా ప్రభుత్వం.. కనీసం అయిదు ప్రావిన్సుల్లో 3–11 ఏళ్ల మధ్య చిన్నారులకు కూడా టీకా వేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడా కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటమే ఇందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. హుబే, ఫుజియాన్, హైనాన్, జెజియాంగ్, హునాన్ ప్రావిన్స్‌ల యంత్రాంగాలు త్వరలో చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపడుతున్నాయి. ఇందుకోసం దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్ టీకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.
ఈ వ్యాక్సిన్లను చిలీ, అర్జెంటీనా, కాంబోడియా ప్రభుత్వాలు తమ దేశాల్లోని చిన్నారులకు ఇవ్వడం ప్రారంభించాయి.ప్రపంచంలోనే అత్యధికంగా 140 కోట్లున్న చైనా జనాభాలో 100 కోట్ల మందికి పైగా అంటే 76% మందికి దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్ టీకాలను పంపిణీ చేసింది. ఈ రెండు టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ విషయంలో స్పష్టత రాలేదు. డెల్టా వేరియంట్ నుంచీ సినోఫాం, సినోవాక్ రక్షణ కల్పిస్తున్నాయని చైనా అంటోంది.