దాదాపు మూడు లక్షలకు చేరువలో కొత్త కేసులతో దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్న తరుణంలో భారత వైద్య పరిశోధన మండలి భారీ ఊరట నిచ్చే అంశాన్ని ప్రకటించింది. మార్చి 11 నాటికి కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరుకుంటుందని ఎపిడెమియోలాజికల్ విభాగానికి చెందిన సైంటిస్ట్ డి సమీరన్ పాండా వెల్లడించారు. డెల్టాను ఒమిక్రాన్ అధిగమిస్తే ఇక కరోనా అంతమైనట్టేనని భావించవచ్చన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కొత్త వేరియంట్లేవీ ఉద్భవించకపోతే మార్చి 11 నాటికి కోవిడ్ స్థానికంగా సాధారణ ఫ్లూగా మారుతుందని ఆయన చెప్పారు.తమ గణాంకాల ప్రకారం డిసెంబరు 11 నుండి ఒమిక్రాన్ వేవ్ మూడు నెలల పాటు కొనసాగనుందన్నారు.
దీని ప్రకారం మార్చి 11 తరువాత నుంచి కరోనా నుంచి ఉపశమనం లబించవచ్చని పాండా తెలిపారు. అయితే ఢిల్లీ, ముంబై కోవిడ్ కేసుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయా, ఇంతటితో ఉదృతి ముగిసిందా అని చెప్పేందుకు మరో రెండు వారాలు వేచి చూడాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో మహమ్మారి వివిధ దశల్లో ఉందనీ, వైరస్‌లోని ఎపిడెమియోలాజికల్ వైవిధ్యాలు, కరోనా రూపాంతరాల నేపథ్యంలో ఐసీఎంఆర్ తన టెస్టింగ్ వ్యూహాన్ని కూడా మార్చుకుంది, పరీక్షల్ని తగ్గించాలని చెప్పలేదని సమీరన్ పాండా అన్నారు.హై రిస్క్ కాకపోతే కరోనా రోగులు కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు చేయాల్సిన అవవసరం లేదనే మార్గదర్శకాలిచ్చినట్టు వెల్లడించారు.
అలాగే జెనోమిక్ సీక్వెన్సింగ్ గురించి మాట్లాడుతూ, “జెనోమిక్ సీక్వెన్సింగ్ అనేది ఒక డైనమిక్ దృగ్విషయం. ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ల తీవ్రతను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేస్తున్నామన్నారు. అలాగే మోల్నుపిరావిర్‌ను ప్రభుత్వ ప్రోటోకాల్‌నుంచి మినహాయించడంపై తమకు, డీసీజీఐ మధ్య డిస్‌కనెక్ట్ ఉందనే ఊహాగానాలను తోసిపుచ్చారు. వ్యాక్సినేషన్ తీసుకోని రోగులకు మోల్నుపిరావిర్ ఇవ్వవచ్చు, కానీ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే మహిళలు,పిల్లలకు దానిని అందించే విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవు, అందుకే ఇది ప్రోటోకాల్‌లో లేదని వివరణ ఇచ్చారు.